Current Date: 26 Nov, 2024

జనసేనలోకి విడదల రజిని? జోరుగా మంతనాలు

ఏపీ మాజీ మంత్రి విడదల రజిని పార్టీ మారబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసిన రజిని 49,772 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దాంతో వైసీపీలో తనకి భవిష్యత్తు లేదని కంగారుపడుతున్న రజిని పార్టీ మారేందుకు ప్రయత్నాలు ఆరంభించినట్లు తెలుస్తోందివాస్తవానికి విడదల రజిని మొదట తెలుగుదేశంలో ఉన్నారు. ‘‘సైబరాబాద్‌లో చంద్రబాబు నాటిన మొక్క నేను’’ అంటూ వెలుగులోకి వచ్చిన రజిని 2019లో వైసీపీ అధికారంలోకి రాబోతోందని గ్రహించి జంప్ అయ్యారు. ఆ ఎన్నికల్లో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలిచిన రజిని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ.. స్థానికంగా ఆమెపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ దఫా ఆమె గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు. కానీ.. ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన గల్లా మాధవి చేతిలో ఓడిపోయారు.విడదల రజిని ఓ జాతీయ పార్టీతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ ఏది అనేది స్పష్టత రాలేదు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే టీడీపీతో జత కట్టింది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటోంది. ఇక కాంగ్రెస్‌. దాదాపుగా ఉనికిలో లేని కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉండకపోవచ్చు. దాంతో జనసేనలో ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Share