Current Date: 06 Oct, 2024

గాడిద పాలతో.. సాఫ్ట్‌వేర్ జీతంకి మించి ఆదాయం

ఏలూరు జిల్లాలో ఓ రైతు సరికొత్త ఆలోచనతో భారీగా ఆదాయాన్ని గడిస్తున్నారు. గొర్రెల్ని పెంపకం చేపట్టిన ఆయన.. ఇప్పుడు మరో కొత్త వ్యాపారం ప్రారంభించారు. లీటర్ పాలు ఏకంగా రూ.2వేలకు అమ్ముతున్నారు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి.. ఏ పాలు అనే కదా మీ అనుమానం.. అవే గాడిదపాలు. ఏకంగా డెయిరీ ఫామ్ రేంజ్‌లో బిజినెస్ చేస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఆ రైతు.ప్రతిరోజూ గేదె, ఆవు పాలను జనాలు కొనుగోలు చేస్తుంటారు. కానీ ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం నరసన్న పాలెంలో మాత్రం.. వెంకటరెడ్డి అనే రైతు గాడిద పాలను విక్రయిస్తున్నారు. వెంకటరెడ్డి గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.. ఇంతలో గాడిద పాలకు మంచి డిమాండ్ ఉందని తెలిసి ఆ దిశగా అడుగులు వేశారు. గాడిద పాలు తాగితే ఊపిరితిత్తుల్లో నెమ్ము, ఆయాసం తగ్గేందుకు ఉపయోగపడుతుందని ఎవరో చెప్పడంతో బిజినెస్ ఐడియా వచ్చింది.రైతు వెంకటరెడ్డి రూ.7లక్షలతో 40 గాడిదలను కొనుగోలు చేశారు. ఆ గాడిదల్ని రోడ్డు పక్కన గాడిద పాలు అమ్ముతామంటూ ప్లెక్సీలను ఏర్పాటు చేశాడు. ఈ సమాచారం తెలియడంతో ప్రజలు పాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. లీటర్ పాలు రూ.2వేలకు విక్రయిస్తున్నట్లు వెంకట రెడ్డి చెబుతున్నారు. డిమాండ్‌ను బట్టి పాలను గాడిదల నుంచి సేకరించి విక్రయిస్తున్నట్లు తెలిపారు. రోజుకు సుమారుగా నాలుగు లీటర్ల పాలను సేకరిస్తున్నామని.. గుంటూరుతో పాటుగా తమిళనాడు వంటి ప్రాంతాలలో ఈ పాలకు డిమాండ్ ఉందని తెలిసిందన్నారు. అందుకే అక్కడికి కూడా సంఫరా చేసే ఆలోచన చేస్తున్నట్లు వెంకటరెడ్డి తెలిపారు.