Current Date: 07 Apr, 2026

సోషల్ మీడియాలో కొత్త మోసం.. ఫేస్‌బుక్ స్టోర్‌తో ఐటీ ఉద్యోగిని బురిడీ

హైదరాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన మహిళ మాయమాటలు నమ్మి ఏకంగా రూ. 2.36 కోట్లు పోగొట్టుకున్నాడు. కొండాపూర్‌లో నివసించే వీరభద్రరావుకు గతేడాది ఆగస్టులో 'కోరా' అనే పేరుతో ఒక మహిళ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తాను సింగపూర్‌కు చెందిన వ్యక్తినని, ప్రస్తుతం ముంబైలో ఉంటున్నానని నమ్మబలికిన ఆమె, కొద్దిరోజుల చాటింగ్ తర్వాత ఫోన్ నంబర్లు మార్చుకుని బాధితుడితో సాన్నిహిత్యం పెంచుకుంది. తమ స్నేహితులంతా 'ఫేస్‌బుక్ స్టోర్' ద్వారా పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు గడిస్తున్నారని నమ్మించిన కోరా, బాధితుడిని కూడా అందులో చేరమని ప్రోత్సహించింది. ఇందుకోసం ఆమె ఒక ఏపికే ఫైల్‌ను పంపగా, దాన్ని డౌన్‌లోడ్ చేయగానే అచ్చం ఫేస్‌బుక్ తరహా యాప్ ఫోన్‌లో ప్రత్యక్షమైంది. అందులో వస్తువులు కొనుగోలు చేస్తూ, విక్రయిస్తూ లాభాలు సంపాదించవచ్చని, సలహాల కోసం జర్మనీకి చెందిన 'బెల్లా' అనే మరో స్నేహితురాలిని సంప్రదించాలని సూచించింది. వారి మాటలు నమ్మిన వీరభద్రరావు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో క్రిప్టో వాలెట్ ద్వారా సుమారు రూ. 2.36 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. యాప్‌లో లాభాలు వస్తున్నట్లు కనిపిస్తున్నా, వాటిని విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇవ్వకపోవడంతో బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు. పెట్టుబడి, లాభం రెండూ తిరిగి రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.