చెన్నైలో తెలుగు వారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరీ.. పోలీసులకి దొరక్కుండా పరారీలో ఉంది. ‘‘సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని ఆమె వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్ చేసింది. అలా అయితే, ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు..?’’ అని ఆమె విద్వేషపూరితంగా మాట్లాడింది. కస్తూరి వ్యాఖ్యలపై తెలుగు వారు ఆగ్రహం వ్యక్తం చేయగా.. చెన్నైలో కేసు నమోదైంది. దాంతో నష్టాన్ని గ్రహించిన కస్తూరీ.. తెలుగు గడ్డ తనకు మెట్టినిల్లు అని, తెలుగు ప్రజలను తాను కించపరిచే విధంగా మాట్లాడలేదని చెబుతూనే క్షమాపణ కూడా చెప్పింది. తాను చేసిన వ్యాఖ్యలను డిఎంకే పార్టీ నేతలే తప్పుగా ప్రచారం చేశారని వారిపై ఆమె ఫైర్ అయింది. కస్తూరి చేసిన వ్యాఖ్యలతో చెన్నై,మదురై వంటి ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. సమన్లు జారీ చేసేందుకు కస్తూరి ఇంటికి పోలీసులు వెళ్లగా.. తాళం వేసి ఉందని చెప్తున్నారు. ఆమె ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉండటంతో.. కేసుల భయంతో పరారీలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Share