బీఆర్ఎస్ హయాంలో విపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. సస్పెండెడ్ పోలీసు అధికారి నాయిని భుజంగరావు తాజాగా ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్‌తో కలకలం రేగింది. హైకోర్టు జడ్జీల ఫోన్లను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేయించిందని ఆయన చెప్పారు. ఇకఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా కీలక వివరాలు ఉన్నాయి. దాదాపు 1200 మంది ఫోన్లను ట్యాప్ చేశామని.. ఎన్నికల టైంలో విపక్ష నేతలపై నిఘా పెట్టి వారికి వెళ్లే డబ్బును అడ్డగించామని చెప్పారు. తాము ఫోన్లను ట్యాప్ చేసిన ప్రముఖుల లిస్టులో జడ్జిలు, స్థిరాస్తి వ్యాపారులు కూడా ఉన్నారని ఆయన అంగీకరించారు.కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ సాయంతో ట్యాపింగ్ చేశామని ప్రణీత్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లు, 56 మంది ఎస్‌వోటీ సిబ్బందిని వాడుకున్నామని ప్రణీత్ వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్‌ను ఇక ఆపేయాలని ప్రభాకర్‌రావు నుంచి ఆదేశాలు అందాయని ప్రణీత్ రావు పేర్కొన్నారు. ప్రభాకర్ రావు రాజీనామా చేసే ముందే రికార్డులన్నీ ధ్వంసం చేయాలని సూచించారని చెప్పారు. అందుకే తాము రికార్డులను ధ్వంసం చేసి, కొత్తవాటిని అమర్చామని తెలిపారు. ధ్వంసం చేసిన ఆధారాలను నాగోలు, మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో పడేసినట్లు ప్రణీత్ వెల్లడించారు.