లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని 118 మంది విపక్ష ఎంపీలు.. సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్‌కు నోటీసు అందజేశారు. సభను నిర్వహించడంలో స్పీకర్ తీవ్ర పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని, రాజ్యాంగబద్ధమైన తన కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. ప్రధానంగా విపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం, ప్రధాని సీటు వద్ద ఎంపీలు అవాంఛనీయ ఘటనలకు పాల్పడవచ్చని స్పీకర్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజ్యాంగంలోని అధికరణం 94(సి) కింద ఈ నోటీసును అందజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో, నైతిక బాధ్యత వహిస్తూ తీర్మానంపై చర్చ ముగిసే వరకు సభాపతి స్థానంలో కూర్చోకూడదని ఓం బిర్లా నిర్ణయించుకున్నారు. ఈ నోటీసుపై మార్చి 9న చర్చ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ సహా పలు 'ఇండియా' కూటమి పార్టీలు దీనిపై సంతకాలు చేయగా, తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ప్రస్తుతానికి దూరంగా ఉంది. స్పీకర్‌కు కొంత సమయం ఇవ్వాలని టీఎంసీ అభిప్రాయపడగా, రాహుల్ గాంధీ కూడా సాంకేతిక కారణాలతో ఈ నోటీసుపై సంతకం చేయలేదు. మరోవైపు అధికార భారతీయ జనతా పార్టీ విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. స్పీకర్‌ను కాకుండా రాహుల్ గాంధీని, కాంగ్రెస్‌ను అభిశంసించాలని సంబిత్ పాత్ర విమర్శించారు. రాజ్యాంగ సంస్థలపై విపక్షాలు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. సభలో చోటుచేసుకుంటున్న ఈ గందరగోళం మధ్యే బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోంది.
Share