Current Date: 08 Feb, 2026

హోం గార్డు అతితెలివి.. ఏసీబీలో పనిచేస్తూ 10 కోట్లు అక్రమార్జన!

విజయనగరం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB)లోనే పనిచేస్తూ అవినీతికి పాల్పడిన నెట్టి శ్రీనివాసరావు అనే హోంగార్డు బాగోతం వెలుగులోకి వచ్చింది. 2010లో పోలీస్ శాఖలో చేరి ఏసీబీ విభాగంలో పనిచేసిన ఈయన, ఉన్నతాధికారుల కదలికలను నిశితంగా గమనించేవారు. సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు వంటి అధికారులపై ఏసీబీ దాడులు జరిగే సమయంలో ముందస్తు సమాచారాన్ని వారికి లీక్ చేస్తూ, ప్రతిఫలంగా భారీ మొత్తంలో నగదు వసూలు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. ఇటీవల శ్రీనివాసరావుపై ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు బదిలీ చేసినప్పటికీ, ఏసీబీ పేరు చెప్పుకొని అక్రమార్జన కొనసాగించారు. దీనిపై నిఘా ఉంచిన ఏసీబీ డీఎస్పీ రమ్య నేతృత్వంలోని బృందాలు విజయనగరం, విశాఖపట్నంలోని ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో రెండు ఫ్లాట్లు, ఒక భవనం, నాలుగు ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూమితో పాటు కిలోల కొద్దీ వెండి, బంగారం, భారీగా బ్యాంకు నిల్వలను గుర్తించారు. హోంగార్డుగా తక్కువ జీతం పొందుతున్న శ్రీనివాసరావు కూడబెట్టిన ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.10 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమాస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేసి విశాఖపట్నంలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.