కుక్కే కదాని ఇంటి బయటకు తీసుకెళ్లి వదిలేస్తే.. అదక్కడ బహిరంగ మలవిసర్జన చేస్తే.. మీ జేబుకు చిల్లులు పడ్డట్లే. మున్సిపల్ సిబ్బంది విధించే జరిమానా కట్టి తీరాల్సిందే. మున్సిపల్ చట్టంలో ఉన్న ఈ నిబంధనను ఇకమీదట తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో కఠినంగా అమలు చేయనున్నారు.పట్టణాల్లో పరిసరాల అపరిశుభ్రతకు శునకాల మలవిసర్జన ఓ కారణం. వీధి కుక్కల సంగతి పక్కనపెడితే కనీసం పెంపుడు శునకాల విషయంలోనైనా వాటి యజమానులు జాగ్రత్తగా ఉండేలా చూడటం మున్సిపల్ శాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ఉద్దేశం. దీని ప్రకారం ఏదైనా పెంపుడు శునకం వీధిలో మలవిసర్జన చేస్తే దాని యజమానికి రూ.వెయ్యి వరకూ జరిమానా విధించవచ్చు. ఈ జరిమానా ఆయా మున్సిపాలిటీలను బట్టి మారుతుంటుంది. ఎవరైనా తమ పెంపుడు శునకాలను రోడ్లమీదకు వదిలేస్తే.. అవి అక్కడ మలవిసర్జన చేస్తే.. వాటి యజమానులే దాన్ని తొలగించి శుభ్రం చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే రూ.వెయ్యి వరకూ చెల్లించాల్సిందే.