ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి రావడంతో పరారైన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. ఆయనపై నమోదైన హత్యాయత్నం కేసుల్లో హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించిన వెంటనే అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. మూడు కేసుల్లోనూ జూన్ 6 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.హైకోర్టులో ఉపశమనం లభించడంతో రాత్రి 9 గంటల సమయంలో నరసరావుపేట చేరుకున్న ఆయన స్థానికంగా ఓ హోటల్‌లో బస చేశారు. ప్రతి రోజూ ఎస్పీ ఎదుట హాజరు కావాలన్న కోర్టు షరతు ప్రకారం రాత్రి 12 గంటల సమయంలో పల్నాడు ఎస్పీ మలికా గార్గ్ ఎదుట హాజరయ్యారు.