Current Date: 26 Nov, 2024

స్కూటీలో భారీగా నగదు తరలింపు... పట్టుకున్న ద్వారకా పోలీసులు

 అనుమానాస్పదంగా ద్వారకా నగర్ జంక్షన్ లో స్కూటీలో భారీగా నగదు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ద్వారకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రూ. లక్ష దాటి నగదును తరలించరాదని నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో ద్వారకా నగర్ మొదటి లైన్ జంక్షన్ వద్ద ఇద్దరు వ్యక్తులు స్కూటీలో భారీగా నగదును మంగళవారం తరలిస్తున్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. దీంతో ద్వారక సిఐ రమేష్, సిబ్బందితో అక్కడికి చేరుకొని  స్కూటీలో నగదు తరలిస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకొని, స్కూటీని నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నగదును సీతంపేట, గణపతి ఆలయం సమీపంలోని చిట్ఫండ్ కంపెనీ నుండి డ్రా చేసి తీసుకుని వెళ్తున్నట్టు పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. డ్రా చేసి నగదు రూ.52 లక్షలని తెలిసింది. దీనిపై విచారణ చేస్తున్నామని, వివరాలు తెలియజేస్తామని ద్వారకా సిఐ రమేష్ అంటున్నారు. ద్వారక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.