ఏపీలో గ్యాస్ కొరత కారణంగా హోటల్, అనుబంధ రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. స్టార్ హోటళ్ల నుంచి గల్లీలోని కర్రీ పాయింట్ల వరకు అన్నింటిపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గ్యాస్ సిలిండర్ల కొరతతో ఆదివారం నాటికే వివిధ నగరాల్లో సగానికి పైగా కర్రీ పాయింట్లు, టిఫిన్ బండ్లు మూతపడగా, తెరిచిన చోట కూడా మెనూను భారీగా తగ్గించేశారు. బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్ ధరలు రెట్టింపు అవ్వడం, రవాణా ఇబ్బందుల వల్ల సోమవారం నుంచి పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది. స్టార్ హోటళ్లలో గతంలో 45 రకాలుగా ఉండే బఫే మెనూను ప్రస్తుతం కేవలం 15 రకాలకే పరిమితం చేశారు. ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ నిర్ణయం మేరకు చికెన్, వెజ్ బిర్యానీలు, కొన్ని రకాల కూరలు, రోటీలతోనే సరిపెడుతున్నారు. యుద్ధ ప్రభావం తగ్గేవరకు ఇదే పరిస్థితి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. అటు చిన్న హోటళ్లలో సాంబారు వంటి అదనపు పదార్థాలను నిలిపివేయడమే కాకుండా, ధరలను కూడా సుమారు 50 శాతం వరకు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. గ్యాస్ దొరకని పక్షంలో ప్రత్యామ్నాయంగా కొన్ని హోటళ్లలో కట్టెల పొయ్యిలపై వంటలు ప్రారంభించారు, దీనివల్ల కట్టెల అడితిలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మరోవైపు డొమెస్టిక్ సిలిండర్లను వాడుతున్న చిన్న వ్యాపారులపై అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఆహార పదార్థాల లభ్యత తగ్గడంతో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సంస్థల వ్యాపారం కూడా మందగించింది.
Share