Current Date: 15 Mar, 2026

పాక్ ప్లేయర్‌‌‌ కారణంగా వివాదంలోకి కావ్య మారన్.. హైదరాబాద్ ఫ్రాంఛైజీకి కష్టాలు

ఇంగ్లాండ్‌లో జరిగే 'ద హండ్రెడ్‌' లీగ్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఫ్రాంఛైజీ రూ. 2.34 కోట్లకు కొనుగోలు చేయడం పెను దుమారానికి దారితీసింది. సన్‌రైజర్స్‌ లీడ్స్ జట్టు ఐపీఎల్‌లోని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యజమాని సన్‌ గ్రూప్‌నకు చెందినది కావడమే ఈ వివాదానికి కారణం. భారతీయ యాజమాన్యం కలిగిన ఒక జట్టు పాక్ ఆటగాడిని తీసుకోవడం జాతీయ భావాలకు విరుద్ధమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ లీడ్స్‌కు చెందిన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా కూడా తాత్కాలికంగా సస్పెండ్ అయింది. ఈ వివాదంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టతనిచ్చారు. ఇది పూర్తిగా విదేశీ లీగ్‌కు సంబంధించిన అంశమని, ఇందులో బోర్డు జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. nలండన్‌లో జరిగిన ఈ వేలంలో సన్‌రైజర్స్‌ సీఈవో కావ్య మారన్‌ స్వయంగా పాల్గొని అబ్రార్‌ను దక్కించుకున్నారు. మరోవైపు, అబ్రార్ అహ్మద్ ఎంపికను జట్టు హెడ్ కోచ్ డానియల్ వెట్టోరి సమర్థించుకున్నారు. తాము కేవలం ప్రతిభ ఆధారంగానే ఆటగాళ్లను ఎంచుకున్నామని, ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని వెల్లడించారు.