Current Date: 08 Feb, 2026

వేలానికి మళ్లీ జయలలిత ఆస్తులు.. వారసులు తర్జన భర్జన

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె.జయలలిత చెల్లించాల్సిన ఆదాయపు పన్ను, సంపద పన్ను బకాయిల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ బకాయిలను సకాలంలో చెల్లించని పక్షంలో, ఇప్పటికే స్తంభింపజేసిన (అటాచ్ చేసిన) ఆమె ఆస్తులను వేలం వేయడానికి సిద్ధమవుతున్నట్లు ఆదాయపు పన్ను విభాగం మద్రాసు హైకోర్టుకు వెల్లడించింది. జయలలిత వారసులుగా ప్రకటించబడిన ఆమె అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది.ఐటీ శాఖ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం.. 2026 జనవరి 31 నాటికి జయలలిత పేరు మీద సుమారు 30 కోట్ల వరకూ ఆదాయపు పన్ను బకాయిలు ఉన్నాయి. గతంలో ఈ బకాయిల మొత్తంపై సందిగ్ధత ఉండగా, తాజాగా ఐటీ విభాగం స్పష్టతనిచ్చింది. మొత్తం బకాయిల్లో ఇప్పటివరకు దీపక్  కొంత చెల్లించినట్లు అధికారులు కోర్టుకు తెలిపారు. జయలలిత ఆస్తులకు సంబంధించి తమకు పంపిన నోటీసులను సవాలు చేస్తూ దీప హైకోర్టును ఆశ్రయించగా, స్పష్టమైన బకాయి మొత్తం తెలిస్తే చెల్లించడానికి తాము సిద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ ఇచ్చిన వివరణపై ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. నిబంధనల ప్రకారం బకాయిలు చెల్లించకపోతే జయలలిత నివాసం సహా ఇతర ఆస్తులు వేలానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.