Current Date: 08 Feb, 2026

పేరెంట్స్‌కి అలెర్ట్.. కొరియన్ సిరీస్‌లకు బానిసలైపోతున్న పిల్లలు

కొరియన్ ఆన్‌లైన్ గేమ్స్, సంస్కృతి పట్ల పెంచుకున్న విపరీతమైన వ్యామోహం ముగ్గురు మైనర్ బాలికలు ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఘజియాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న నిషిక (16), ప్రాచి (14), పాఖి (12) అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు తెల్లవారుజామున తమ భవనం 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా సమయం నుండి వీరు కొరియన్ డ్రామాలు, కె-పాప్ సంగీతం మరియు ‘కొరియన్ లవ్ గేమ్స్’ అనే టాస్క్ ఆధారిత యాప్‌లకు తీవ్రంగా బానిసలైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ బాలికలు తమ గదిలో వదిలివెళ్లిన ఎనిమిది పేజీల సూసైడ్ నోట్, డైరీలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. "సారీ నాన్న.. మేము కొరియాను వదలలేము, కొరియానే మా జీవితం" అని వారు అందులో పేర్కొన్నారు. తాము భారతీయులము కాదని, కొరియన్ రాజకుమార్తెలమని భ్రమల్లో బతికేవారని, వారి పేర్లను కూడా కొరియన్ పేర్లుగా మార్చుకున్నారని పోలీసులు తెలిపారు. గత రెండేళ్లుగా వీరు పాఠశాలకు కూడా వెళ్లడం మానేసి, బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని కేవలం ఆన్‌లైన్ లోకానికే పరిమితమయ్యారు. ఈ ‘కొరియన్ లవ్ గేమ్స్’ అనేవి వర్చువల్ పాత్రలతో చాటింగ్ చేస్తూ, వారు ఇచ్చే ప్రమాదకరమైన టాస్క్‌లను పూర్తి చేసేలా పిల్లలను ప్రేరేపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో సంచలనం సృష్టించిన ‘బ్లూ వేల్’ ఛాలెంజ్ తరహాలోనే ఇవి కూడా పిల్లలను భావోద్వేగంగా బానిసలను చేసి, చివరకు ఆత్మహత్యల వైపు నడిపిస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల డిజిటల్ అలవాట్లపై నిఘా ఉంచాలని, వారితో స్నేహపూర్వకంగా ఉంటూ వాస్తవిక ప్రపంచంతో అనుబంధాన్ని పెంచాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.