యూపీలో 121 మంది మృతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి, సంఘటనకు బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని భారత నాస్తిక సమాజం కేంద్ర కమిటీ నాయకులు జె రవి, టి శ్రీరామ్మూర్తి సంయుక్తంగా బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని హద్రాస్ జిల్లా, ఫుల్ రయీ గ్రామంలో భోలే బాబా దర్శనం కోసం, అతని పాదాల చుట్టూ ఉన్న మట్టి సేకరించే ప్రయత్నంలో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించడం, సుమారు 300 మంది గాయపడిన సంఘటన అత్యంత విషాదకరమని తెలిపారు. మరణించిన వారిలో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారన్నారని పేర్కొన్నారు. సంఘటనపై ఎఫ్ ఐ ఆర్ నమోదు అయినందున బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి, మరణించిన వారి కుటుంబాలకు సత్సంగ్ సంస్థ నుంచి పది లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.