అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో శనివారం ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈశాన్య భారతంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-130J సూపర్ హెర్క్యులస్ విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. జాతీయ రహదారి 37 (NH-37)పై మొరాన్ బైపాస్ వద్ద సుమారు 4.2 కిలోమీటర్ల మేర పటిష్టంగా నిర్మించిన ఈ రన్‌వేను ప్రధాని స్వయంగా ప్రారంభించి, అక్కడ నిర్వహించిన వైమానిక ప్రదర్శనను వీక్షించారు. సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది. ఇది చైనా సరిహద్దు (LAC)కి కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉండటం విశేషం. యుద్ధ సమయాల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో వాయుసేన ఫైటర్ జెట్లు, భారీ రవాణా విమానాలు ల్యాండింగ్ కావడానికి ఇది ప్రత్యామ్నాయ రన్‌వేగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే రాఫెల్, సుఖోయ్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు ఇక్కడ విజయవంతంగా ట్రయల్స్ పూర్తి చేసుకున్నాయి.
Share