ప్రముఖ కోలీవుడ్ నటుడు ధనుష్ మళ్లీ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ప్రముఖ నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిల్మ్స్ ఆయనకు లీగల్ నోటీసులు పంపడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు పదేళ్ల క్రితం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ధనుష్ ఉల్లంఘించారని, దీనివల్ల తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని సదరు సంస్థ ఆరోపిస్తోంది. ఇందుకు పరిహారంగా రూ. 20 కోట్లు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 2016లో తేనాండాళ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ‘నాన్ రుద్రన్’ అనే సినిమా చేసేందుకు ధనుష్ అంగీకరించారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే, మధ్యలో దర్శకుడు మారడం, ధనుష్ పూర్తి స్థాయి స్క్రిప్ట్ అందించకపోవడంతో ప్రాజెక్ట్ నిలిచిపోయింది. షూటింగ్‌కు హాజరుకాకుండా ఇతర సినిమాలకు కాల్‌షీట్లు ఇస్తున్నారని, దీనివల్ల తమకు నష్టం కలిగిందని నిర్మాతలు నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు, ధనుష్ ప్రస్తుతం తన 55వ సినిమా ‘డీ 55’ పనుల్లో బిజీగా ఉన్నారు. ‘అమరన్’ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో టాలీవుడ్ సెన్సేషన్స్ సాయి పల్లవి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు.
Share