Current Date: 19 May, 2026

నాకేం అసూయ లేదు.. విజయ్ సీఎం అవ్వడంపై రజినీకాంత్రి రియాక్షన్

నటుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయినందుకు తనకు ఎలాంటి అసూయ లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సినీరంగం నుంచి వచ్చిన విజయ్.. డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ వంటి బలమైన పార్టీలను వ్యతిరేకించి శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా పోరాడి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారని కొనియాడారు. గతంలో ఎంజీఆర్, ఎన్టీఆర్ సైతం సాధించని అద్భుతమైన రికార్డును విజయ్ సాధించారని రజనీకాంత్ ప్రశంసించారు. విజయ్ గెలుపుపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని రజనీకాంత్ తీవ్రంగా ఖండించారు. తాను అసలు రాజకీయాల్లోనే లేనప్పుడు అసూయపడాల్సిన అవసరం ఏముందని, బహుశా తన సమకాలీనుడైన కమల్ హాసన్ సీఎం అయి ఉంటే కొద్దిగా అసూయ కలిగేదేమోనంటూ చమత్కరించారు. విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేందుకు తాను డీఎంకే, అన్నాడీఎంకేలను ఏకం చేయడానికి ప్రయత్నించాననే ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన.. తాను అంత స్థాయికి దిగజారే వ్యక్తిని కాదన్నారు. ఒకవేళ తాను 2001 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే 100 శాతం గెలిచేవాడినని, రాజకీయాల్లోకి ఎందుకు రాలేకపోయానో గతంలోనే వివరించానని గుర్తుచేశారు. తమిళనాడులో దాదాపు 60 ఏళ్ల పాటు సాగిన ద్రావిడ పార్టీల పాలనను చూసిన ప్రజలు మార్పును కోరుకున్నారని, సరిగ్గా అదే సమయంలో విజయ్ రాజకీయాల్లోకి రావడం ఆయనకు కలిసివచ్చిందని రజనీకాంత్ విశ్లేషించారు. విజయ్‌కున్న సినీ గ్లామర్‌తో పాటు యువత, మహిళలు, సోషల్ మీడియా శ్రేణులు ఈ భారీ విజయానికి బాటలు వేశాయని పేర్కొన్నారు. విజయ్ గెలవగానే తాను 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశానని చెబుతూ.. "దొరికేది దొరకక మానదు.. దొరకనిది ఎన్నటికీ దొరకదు" అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.