టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గొప్ప మనసు చాటుకున్నాడు. తన పుట్టినరోజుని పురస్కరించుకుని సమాజ సేవ కోసం ఒక అడుగు ముందుకు వేశాడు. బర్త్‌డే సెలబ్రేషన్స్ కంటే సేవకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ "ఐక్యధైర్య సేన సమితి" పేరిట కొత్త ట్రస్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు తోడు నిలిచిన వారిని గుర్తుచేసుకుంటూ, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడమే లక్ష్యంగా ఈ సంస్థను స్థాపించినట్లు ఆయన పేర్కొన్నారు. తన భార్య భూమా మౌనిక రెడ్డి ప్రేరేపించిన ఆలోచనతోనే ఈ "ఐక్యధైర్య సేన సమితి"ని ప్రారంభించినట్లు మనోజ్ వెల్లడించారు. 'ఐక్య' అంటే ఐకమత్యమని, మానవత్వం కోసం అందరూ ఏకం కావాలన్నదే దీని ముఖ్య ఉద్దేశమని వివరించారు. దేవుడు తమకు ప్రసాదించిన దాన్ని సేవ ద్వారా నలుగురికీ పంచుతామని, రక్తదానం, అత్యవసర వైద్య సహాయం వంటి రంగాలలో ఈ సంస్థ ముందుంటుందని స్పష్టం చేశారు. అలాగే ఇది రాజకీయం కోసం పెట్టినది కాదని, మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరి సంస్థ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా మంచు మనోజ్ అప్పుడే ఒక మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి ప్రాజెక్ట్‌గా ఐదుగురు అనాథ పిల్లలను దత్తత తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ రోజు నుంచి ఆ ఐదుగురు పిల్లల పూర్తి బాధ్యతలను తానే చూసుకుంటానని మనోజ్ మనస్ఫూర్తిగా హామీ ఇచ్చారు.