Current Date: 19 May, 2026

ఫస్ట్ నైట్ రోజే భర్త అసలు స్వరూపం బట్టబయలు.. నవవధువు షాకింగ్ నిర్ణయం

కాకినాడ జిల్లాలో పెళ్లయిన 22 రోజులకే ఓ నవవధువు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కిర్లంపూడి మండలం గోనేడ గ్రామానికి చెందిన సత్యంశెట్టి వెంకటలక్ష్మి (25) అనే డిగ్రీ చదివిన యువతికి, గత ఏప్రిల్ 25న పెద్దాపురం మండలం మర్లావ గ్రామానికి చెందిన గాది దుర్గాకోటేశ్వరరావుతో వివాహమైంది. అయితే, పెళ్లయిన మొదటి రాత్రే తన భర్త అసలు స్వరూపాన్ని బయటపెట్టడంతో ఆమె తీవ్ర మానసిక క్షోభకు గురైంది. తనకు వేరే మహిళలతో శారీరక సంబంధాలు ఉన్నాయని భర్త స్వయంగా చెప్పడంతో వెంకటలక్ష్మి ఒక్కసారిగా కుంగిపోయింది. అంతేకాకుండా, పెళ్లికి కేవలం రెండు రోజుల ముందే భర్త వేరే ఒక యువతితో రూ.2 లక్షలు ఇచ్చి సెటిల్‌మెంట్ చేసుకున్నట్లు కూడా ఆమెకు తెలిసింది. అంతటితో ఆగకుండా, సదరు భర్త ఇతర మహిళలతో అసభ్యకరంగా ఉన్న చిత్రాలను భార్య వెంకటలక్ష్మి వాట్సప్‌కు పంపిస్తూ తీవ్రంగా వేధించడం గమనార్హం. రెండు రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన ఆమె.. భర్త పెడుతున్న మానసిక నరకాన్ని తల్లి, సోదరికి చెప్పి కన్నీరు మున్నీరైంది. భర్త వేధింపుల విషయమై అత్తారింటికి వెళ్లి నిలదీయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి వరకు గోనేడలోని తమ ఇంట్లో ఈ సమస్యపైనే మాట్లాడుకున్నారు. అయితే, భర్త మోసాన్ని, ఆ వేధింపులను తట్టుకోలేకపోయిన వెంకటలక్ష్మి తీవ్ర మనస్తాపంతో తెల్లవారుజామున ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.