గతేడాది 'లిటిల్ హార్ట్స్', 'మ్యాడ్ స్క్వేర్' వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల హవా నడవగా, 2026లో ఆ మ్యాజిక్ ఏ సినిమాతో మొదలవుతుందనే ఆసక్తి నెలకొంది. సంక్రాంతి సీజన్ ముగిశాక ఇప్పటివరకు పెద్ద సినిమాల సందడే కనిపించగా, ఈ ఫిబ్రవరి వీకెండ్ మాత్రం చిన్న సినిమాల పండగను తలపిస్తోంది. ముఖ్యంగా విలక్షణ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన 'యుఫోరియా' కంటెంట్ పరంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భూమిక చావ్లా, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన 'యుఫోరియా' సామాజిక ఇతివృత్తంతో రూపొందింది. కమర్షియల్ హంగుల కంటే కథకే ప్రాధాన్యతనిచ్చి తీసిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా సక్సెస్ అయితే, ఈ ఏడాది చిన్న సినిమాల విజయ పరంపర ఈ 'యుఫోరియా'తోనే మొదలైనట్లు భావించవచ్చు. చిత్ర యూనిట్ కూడా ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది. యుఫోరియాతో పాటు ఈ వారం 'శ్రీ చిదంబరం గారు', 'సుమతీ శతకం', 'బరాబర్ ప్రేమిస్తా', 'విత్ లవ్', 'బ్లడ్ రోజెస్' వంటి ఆసక్తికరమైన సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిలో వంశీ తుమ్మల, సంధ్య జంటగా నటించిన గ్రామీణ ప్రేమకథ 'శ్రీ చిదంబరం గారు' ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద నిలబడి, ఈ ఏడాదికి 'చిన్న సినిమా' హిట్ బోణీ కొడుతుందో రేపటితో తేలిపోనుంది.