Current Date: 04 Jul, 2024

ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ వాలంటీర్లపై క్లారిటీ!

ఏపీ కేబినెట్ సోమవారం సమావేశం కానుంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది.కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు ఇప్పటికే ఐదు సంతకాలు చేశారు. వీటిలో మెగా డీఎస్సీ, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు, పింఛను డబ్బులు రూ.4 వేల నుంచి 6 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు. దాంతో వీటికి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు.కేబినెట్ భేటీలో సూపర్‌ 6 పథకాల అమలు, అందుకు బడ్జెట్‌ రూపకల్పనపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించిన సంగతి తెలిసిందే. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైనా మంత్రివర్గం చర్చించనుంది. జులై నెలాఖరులోగా కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టాల్సి ఉంది. అలానే వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు లేదా మార్పులు చేర్పులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Share