Current Date: 02 Apr, 2025

చెరకు క్రషర్‌లోకి మహిళ జడ.. అరగంట నరకయాతన

వేసవి కాలంలో చెరకు రసం, పండ్ల రసం తీసి అమ్మడం ఆమెకి జీవనోపాధి. ఏళ్లకి ఏళ్లుగా ఆమె ఈ పని చేస్తోంది. అయినప్పటికీ.. ఒక చిన్న ఏమరపాటు ఆమె అరగంట పాటు నరకాయతన మిగుల్చింది. స్థానికులు మానవత్వంతో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది.డోర్నకల్‌లో చెరకు రసం తయారు చేసే మిషన్‌లో మహిళ తల వెంట్రుకలు చిక్కుకున్నాయి. భయంతో ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల ప్రజలు సహాయక చర్యలు చేపట్టారు. ధైర్యాన్ని కూడబెట్టుకుని వెంట్రుకలు మరింత లోపలకు వెళ్లకుండా తల వెనకాల చేతులతో గట్టిగా మహిళ పట్టుకుంది. దాంతో ఆమె చేతికి స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో క్రషర్‌కి విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ.. లోపల చిక్కుకున్న వెంట్రుకలు బయటకు రాకపోవడంతో కొందరు కత్తెర కోసం పరుగులు తీశారు. ఈలోగా మరికొందరు యంత్రం చక్రాన్ని చేతితో రివర్స్‌లో తిప్పుతూ వెంట్రుకలను బయటకు తీశారు. అప్పటికే ఆమె చేతులకు గాయంకాగా.. జడను లాగడం కారణంగా తలనొప్పితో ఆసుపత్రిలో చేరింది.

Share