టాలీవుడ్.. సంక్రాంతి విజయాలను ఫిబ్రవరి, మార్చి నెలలు కొనసాగించలేకపోవడంతో అందరి దృష్టి ఇప్పుడు ఏప్రిల్ పైనే ఉంది. ఈ నెల తొలివారంలో శర్వానంద్ 'బైకర్' చిత్రంతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. దీనితో పాటు 'రాకాస' అనే హారర్ కామెడీ, అలాగే కొన్ని తమిళ డబ్బింగ్ చిత్రాలు విడుదలవుతున్నప్పటికీ, కేవలం 'బైకర్' మాత్రమే రేసులో బలంగా కనిపిస్తోంది. నెల మధ్యలో అడివి శేష్ 'డకాయిట్', నిఖిల్ 'స్వయంభు' వంటి క్రేజీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అడివి శేష్ చాలా కాలం తర్వాత వెండితెరపై కనిపిస్తుండటంతో 'డకాయిట్'పై ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. మూడో వారంలో నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తిక్', తిరువీర్ 'పాపం ప్రతాప్', కిరణ్ అబ్బవరం నిర్మించిన 'తిమ్మరాజుపల్లి టీవీ' వంటి చిన్న సినిమాలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రాలకు ప్రమోషన్ల పరంగా ఇంకా పెద్దగా హైప్ రావలసి ఉంది. ఏప్రిల్ చివరి వారం మాత్రం రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంతో సందడిగా మారనుంది. ఈ నెలలో విడుదలయ్యే అతిపెద్ద సినిమా ఇదే కావడంతో దీనిపై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన పాటలు చార్ట్ బస్టర్ కావడంతో మెగా అభిమానులు ఈ చిత్రంపై గట్టి నమ్మకంతో ఉన్నారు. మైకేల్ జాక్సన్ బయోపిక్ 'మైకేల్', ధనుష్ 'కర' కూడా ఇదే సమయంలో పోటీలో ఉన్నా, అందరి చూపు మాత్రం రామ్ చరణ్ సినిమా ఫలితంపైనే ఉంది. ఈ సినిమాలు హిట్ అయితేనే టాలీవుడ్ కు వేసవి ఆరంభం ఘనంగా ఉంటుంది.