పల్నాడు జిల్లా మాచర్లలో కలకలం రేపిన యువతి అనుమానాస్పద మృతి కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన ఇష్టానికి విరుద్ధంగా ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో కన్నతండ్రే కుమార్తెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిశ్చితార్థానికి రెండు రోజుల ముందు చౌడేశ్వరి తాను ప్రేమించిన నాగరాజును పెళ్లి చేసుకోవడం, ఈ క్రమంలో తలెత్తిన కుటుంబ గొడవలే ఈ దారుణానికి కారణమయ్యాయి. పోలీసుల మధ్యవర్తిత్వంతో ఐదు రోజులు పుట్టింట్లో ఉండి, ఆ తర్వాత భర్త వద్దకు వెళ్లేలా కుదిరిన ఒప్పందమే ఆమెకు శాపమైంది. భర్త ఇంటికి వెళ్లాల్సిన మార్చి 19కి ఒకరోజు ముందే తండ్రి చంద్రశీను తన పథకాన్ని అమలు చేశాడు. భార్య, కుమారుడిని పొలానికి పంపి, మేనల్లుడి సాయంతో నిద్రిస్తున్న కుమార్తెను దిండుతో ఊపిరి ఆడకుండా చేసి అంతమొందించాడు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, పోస్టుమార్టం నివేదిక అసలు నిజాన్ని బయటపెట్టింది. "ఘనంగా పెళ్లి చేసి పరువు నిలబెట్టుకోవాలనుకున్నా.. కానీ ప్రేమ పెళ్లితో నా పరువు తీసిందన్న ఆవేదనతోనే ఈ పని చేశాను" అని నిందితుడు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఆస్తి, పరువు కోసం కన్నకూతురిని బలితీసుకున్న ఈ 'పరువు హత్య' స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.