Current Date: 13 Mar, 2026

మత్స్యకారుడి గొంతులో ఇరుక్కున్న బతికున్న చేప..ఆసుపత్రికి పరుగులు

ఒంగోలులో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడి ప్రాణాల మీదకు తెచ్చిన వింత ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి చేపలు పడుతుండగా, వలలో చిక్కిన చేపలను వేరు చేసే క్రమంలో నోటితో వలను పట్టుకున్నారు. ఆ సమయంలో వలలో ఉన్న ఒక బతికున్న చేప ఒక్కసారిగా ఎగిరి నేరుగా ఆయన గొంతులోకి వెళ్లి ఇరుక్కుపోయింది. దీంతో శ్వాస ఆడక ఆయన తీవ్ర ఇబ్బంది పడుతూ విలవిలలాడారు. వెంటనే గమనించిన తోటి మత్స్యకారులు సుబ్రహ్మణ్యాన్ని ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈఎన్‌టీ విభాగం వైద్యులు బాధితుడిని పరీక్షించి, చేప గొంతులో లోపలి భాగంలో ఇరుక్కుపోయిందని గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హెచ్‌వోడీ డాక్టర్ ప్రభాకర్ నేతృత్వంలోని వైద్య బృందం అత్యవసరంగా శస్త్రచికిత్సను ప్రారంభించి, చాకచక్యంగా ఆ చేపను బయటకు తీశారు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు. అత్యంత క్లిష్టమైన ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ ప్రభాకర్, వారి బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ మాణిక్యరావు ప్రత్యేకంగా అభినందించారు. ప్రాణమున్న చేప గొంతులో పడటం, దానిని సురక్షితంగా తొలగించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.