Current Date: 13 Mar, 2026

230 మంది మాజీ మావోయిస్టులకు నోటీసులు.. చేసిన తప్పు ఏంటంటే?

మావోయిస్టు అగ్రనేత రామచంద్రారెడ్డి (వికల్ప్) అంత్యక్రియలు, సంస్మరణ సభకు హాజరైన సుమారు 230 మంది మాజీ మావోయిస్టులకు జాతీయ దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేయడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. గతేడాది అక్టోబరు 18న కోహెడలో 'నారాయణపూర్ అమరుల సంస్మరణ సభ' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మాజీలు హాజరయ్యారు. తాజాగా వీరందరికీ నోటీసులు అందడంతో ఆయా గ్రామాల్లో తీవ్ర కలవరం మొదలైంది. ఈ సంస్మరణ సభలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, సోనీ సోరి, గాదె ఇన్నయ్య వంటి ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. అయితే, ఆ సమయంలో గాదె ఇన్నయ్యతో పాటు మరికొందరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వారిపై అప్పట్లో దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల దర్యాప్తులో భాగంగానే, సభకు హాజరైన వారి వివరాలను సేకరించేందుకు, వారి వివరణ తీసుకునేందుకు ఎన్‌ఐఏ ఈ కీలక అడుగు వేసినట్లు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారిలో హుజూరాబాద్, సైదాపూర్, పరకాల, ధర్మసాగర్ వంటి వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. ఇప్పటికే కొందరు మాజీలపై నిఘా వర్గాలు దృష్టి సారించగా, తాజా నోటీసులతో వారంతా ఆందోళన చెందుతున్నారు. కేవలం సభకు హాజరైనందుకే తమపై కేసులు పెడతారా లేదా విచారణకు పిలుస్తారా అన్న అంశంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ పరిణామం రాజకీయంగా, సామాజికంగా కూడా చర్చనీయాంశంగా మారింది.