వివాహం జరిగిన 24 గంటల్లోనే కొత్త వధువు నగలతో పరారైన వింత ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపుర్ జిల్లా, లిస్రీ భగవతీపురీ గ్రామంలో వెలుగుచూసింది. బాధితుడు వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... హల్వండికి చెందిన రాకేశ్ శాస్త్రి అనే పురోహితుడు మూడు నెలల క్రితం ఒక వివాహ ప్రతిపాదనతో అతడిని కలిశాడు. అమ్మాయి కుటుంబం ఆర్థికంగా నిరుపేదదని, గుడిలో వివాహం జరిపించాలని కోరడంతో వినోద్ కుటుంబ సభ్యులు ఈ సంబంధానికి అంగీకరించారు. ఈ నెల 14న రామ్‌పుర్‌లోని శివుడి గుడిలో పురోహితుడు రాకేశ్ సమక్షంలో సీమ అనే యువతితో వినోద్ వివాహం జరిగింది. పెళ్లి సమయంలో బాధితుడు వధువు తల్లికి రూ. లక్ష నగదు సహాయంగా అందించగా, పురోహితుడికి రూ. 2,100 దక్షిణగా ఇచ్చాడు. వివాహం ముగిసిన అనంతరం వధువు సీమను తన ఇంటికి తీసుకెళ్లిన వినోద్, ఆమెకు ఒక బంగారు మంగళసూత్రం, వెండి కంఠహారం, కమ్మలు, పట్టీలను బహుమతిగా ఇచ్చాడు. ఆభరణాలు తీసుకున్న సీమ శోభనం జరగకుండానే ఈ నెల 15న రాత్రి వేళ కుటుంబ సభ్యులందరూ నిద్రపోతున్న సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి పరారైంది. తాను మోసపోయానని గ్రహించిన వరుడు వినోద్ వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.