ఝార్ఖండ్ ప్రభుత్వం ఉద్యోగాల కోసం గత 12 ఏళ్లలో నిర్వహించిన పరీక్షలన్నిటినీ రద్దు చేయడం విద్యార్థుల విజయం గానే భావించాలి. ఝార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సారథ్యంలో జరిగిన పరీక్షలన్నిటి లో అవినీతి అక్రమాలు జరిగాయని కాక్ రోచ్ ప్రేరణ తో ఝార్ఖండ్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనికి సీఎం సొరెన్ స్పందించి అవకతవకలు నిజమేనని అంగీకరించారు. అంతే కాదు ప్రైవేటు ఏజెన్సీ టీఎస్ఆర్ డేటా ప్రొసెసింగ్ ద్వారా జరిగిన అన్ని పరీక్షల్ని రద్దు చేశారు. దీనివల్ల 2 వేల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అయినా ప్రభుత్వం వెనుకాడ లేదంటే కష్ట పడి చదివి పరీక్షలు రాసిన విద్యార్థుల పక్షాన ప్రభుత్వం ఏ విధంగా నిలబడిందో అర్ధం చేసుకోవచ్చు.భవిష్యత్ పరీక్షల నిర్వహణ కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కమిటీ ని కూడా ప్రభుత్వం నియమించింది. అయితే ఇదే కోవలో ఏపీపీఎస్సీ 2018 బ్యాచ్ గ్రూప్ -1 పరీక్షల్లో భారీ అవకతవకలు , అక్రమాలు చోటు చేసుకున్నాయని సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ స్పందించక పోవడం పై చర్చ జరుగుతోంది. 165 మందిలో అత్యధికులు తప్పుడు మార్గంలో వచ్చినట్టు సిట్ నిరూపించింది. అయినా ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ దీనిపై స్పందించక పోవడం విచారకరం అని నిరుద్యోగ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.