హర్మూజ్ జలసంధిపై నియంత్రణ సాధించే విషయమై ఇరాన్, ఒమన్‌ల మధ్య జరుగుతున్న చర్చలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఒమన్ జోక్యం చేసుకుంటే ఆ దేశంపై దాడులు చేస్తామని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. తమ ప్రభుత్వం ఇరాన్ ఇస్లామిక్ విప్లవాత్మక గార్డ్స్ కార్ప్స్‌తో నేరుగా రహస్య సంప్రదింపులు జరుపుతోందని ఆయన వ్యాఖ్యానించగా, ఇరాన్‌తో ఒప్పందంపై తాము తొందరపడటం లేదని పేర్కొన్నారు. అయితే, హర్మూజ్ జలసంధి గుండా నౌకాయాన ప్రణాళికలపై ఒమన్‌తో ప్రాథమిక అవగాహన కుదిరిందని, త్వరలోనే ఉమ్మడి ప్రకటన విడుదల చేస్తామని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పష్టం చేశారు. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని, దౌత్య వ్యవహారాలు తమ పరిధిలోకి రావని పేర్కొంటూ ట్రంప్ ప్రకటనలన్నీ అబద్ధాలని కొట్టిపారేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతుండగా, యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలోని బాబ్ అల్-మాండెబ్ జలసంధి సమీపంలో దాడులకు తెగబడ్డారు. సౌదీ అరేబియాకు చెందిన ఒక నౌక, నాలుగు సైనిక పడవలపై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించి తగలబెట్టినట్లు హూతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరీ ప్రకటించారు. మారిబ్ ప్రాంతంలో ప్రభుత్వంపై డ్రోన్ దాడులు చేసినట్లు తెలిపారు. అయితే ఈ దాడిపై సౌదీ అరేబియా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.