Current Date: 27 Nov, 2024

కెబినెట్ కూర్పులో నారా లోకేశ్ మార్క్, భవిష్యత్ దృష్టిలో పెట్టుకునే జరిగిందా

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ముగిసింది. మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అందరి అంచనాలకు బిన్నంగా ఈసారి కేబినెట్‌పై లోకేష్ మార్క్ స్పష్టంగా కన్పించింది.ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో సీనియర్లకు మొండిచేయి లభించింది. అదే సమయంలో యువరక్తం ఉరకలెత్తుతోంది. సీనియర్లకు మొండిచేయి ఇవ్వడం ద్వారా కేబినెట్‌పై నారా లోకేష్ మార్క్ కన్పిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొందరు మినహా మెజార్టీ యువకులే కన్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సహా 24 మంది ఉన్న మంత్రివర్గంలో 17 మంది తొలిసారి మంత్రి పదవి అనుభవిస్తున్నారు. బీసీలకు ప్రాధాన్యత లభించిన కేబినెట్‌లో సీనియర్లను పక్కనపెట్టడంపై విమర్శలు వస్తున్నా..నారా లోకేశ్ ప్రభావంతో ఇదంతా జరిగినట్టుగా కన్పిస్తోంది.అందుకే ఈసారి  యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, బొండా ఉమామహేశ్వరరావు, దేవినేనిఉమ, నిమ్మకాయల చినరాజప్ప వంటివారినందర్నీ పక్కనపెట్టేశారు. ఇది సాహసోపేతమైనా సరే 17 మంది కొత్తవారికి అవకాశమివ్వడం ద్వారా నారా లోకేష్ భవిష్యత్తు కు మార్గం సుగమం చేసేందుకేననే అభిప్రాయం వ్యక్తమౌతోంది. సీనియర్లతో అయితే నారా లోకేశ్‌కు వివిధ సందర్భాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలున్న నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా 17మంది కొత్తవారితో కేబినెట్ నింపారని తెలుస్తోంది.రానున్న కాలంలో మొత్తం బాధ్యతలు నారా లోకేష్‌కు అప్పగించే అవకాశాలున్నందున దూరదృష్టితోనే కేబినెట్ కూర్పు జరిగిందని తెలుస్తోంది. మొత్తానికి నారా లోకేష్ మార్క్‌తో ఏపీ కొత్త కేబినెట్ కొలువుదీరింది.

Share