Current Date: 21 Jul, 2026

కన్నీళ్లతో ముగిసిన మెస్సీ కెరీర్.. అంతిమ దశలో చేజారిన ఫిఫా కప్

అంతర్జాతీయ ఫుట్‌బాల్ రంగంలో ఒక శకం ముగిసింది. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన, గొప్ప ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సి తన సుదీర్ఘ ప్రయాణానికి స్వస్తి పలికాడు. ఆదివారం రాత్రి 2026 ప్రపంచకప్ ఫైనల్‌లో స్పెయిన్ చేతిలో అర్జెంటీనా పరాజయం పాలవడంతో, ఈ దిగ్గజ ఫుట్‌బాల్ స్టార్ కన్నీళ్లతో అంతర్జాతీయ మైదానం నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. నిజానికి మెస్సి తన అంతర్జాతీయ కెరీర్‌ను పదేళ్ల ముందే ముగించాల్సింది. 2014 ప్రపంచకప్ ఫైనల్‌లో జర్మనీ చేతిలో ఎదురైన పరాజయం, ఆ వెంటనే 2016 కోపా అమెరికా ఫైనల్‌లో చిలీ చేతిలో పెనాల్టీ షూటౌట్‌లో ఓడిపోవడం అతడిని మానసికంగా తీవ్రంగా కుంగిపోయేలా చేశాయి. దీంతో ఆ సమయంలోనే అతను రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, అభిమానుల అపారమైన ప్రేమ, మాజీ ఆటగాళ్లు, ప్రభుత్వ పెద్దల విజ్ఞప్తుల మేరకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ బరిలోకి దిగాడు. నాడు ఎలాంటి ప్రధాన అంతర్జాతీయ టైటిల్ లేకుండా నిరాశతో తప్పుకోవాలనుకున్న మెస్సి.. ఆ తర్వాత పట్టుదలగా ఆడి గడిచిన పదేళ్లలో అర్జెంటీనాకు తిరుగులేని విజయాలు అందించాడు. 2022లో ఎన్నాళ్లో ఎదురుచూసిన ప్రపంచకప్ కల నెరవేరడంతో పాటు, 2021, 2024లో రెండు కోపా అమెరికా టైటిళ్లను సొంతం చేసుకున్నాడు. కెరీర్‌లో ప్రపంచకప్ సాధించలేకపోయిన క్రిస్టియానో రొనాల్డో, నెయ్‌మార్ వంటి సమకాలీన దిగ్గజాలతో పోలిస్తే, మెస్సి అంతర్జాతీయ కెరీర్ అత్యంత వైభవంగా, పరిపూర్ణంగా ముగిసిందనే చెప్పొచ్చు.