కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా, కుట్టికోల్ పంచాయతీ పరిధిలోని ఒట్టమావుంగల్‌లో నిర్మించిన ఒక కొత్త ఇంటి వద్ద సెప్టిక్ ట్యాంక్ కోసం గుంత తవ్వుతుండగా ఊహించని విధంగా ఒక భారీ సొరంగం బయటపడింది. సుమారు రెండు మీటర్ల కంటే ఎక్కువ లోతు తవ్విన తర్వాత ఈ సొరంగం ప్రత్యక్షమవ్వడంతో ఆ ఇంటి యజమాని, పనుల్లో ఉన్న కార్మికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ సొరంగం లోపల నీటి ప్రవాహం (చిన్న వాగు) కూడా ఉండటాన్ని గమనించారు. కాసర్‌గోడ్ ప్రాంతంలో సాధారణంగా గట్టి రాతి పొరలు ఉంటాయని.. ఇలా సొరంగాలు రావడం చాలా అరుదని పురావస్తు శాఖ అధికారులు చెప్తున్నారు. కొత్త ఇంటి కిందే లోతైన గుహ వంటి సొరంగం బయటపడటంతో ఇంటి భద్రతపై యజమాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సొరంగం కారణంగా అందులో నివసించేందుకు కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారట. ఆ ప్రాంతంలో సహజంగా ఉండే భూగర్భ జల మార్గాలు లేదా సాంప్రదాయ సొరంగ బావులు అయి ఉంటాయా? అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఈ సొరంగం చూడటానికి స్థానికులు భారీగా వస్తున్నారు.