తమిళనాడులో మంచితనం, నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఒక పారిశుద్ధ్య కార్మికుడి గాథ అందరినీ కదిలిస్తోంది. తిరువారూర్‌కు చెందిన మున్సిపల్ కార్మికుడు దురైకి రోడ్డుపై 20 సవర్ల బంగారు ఆభరణాలు దొరికాయి. చెన్నైకి చెందిన ఒక వ్యక్తి తన కుమార్తె వివాహం కోసం వీటిని దాచుకోగా, ప్రయాణంలో పోగొట్టుకున్నారు. తన ఇంట్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, దురై ఏమాత్రం ఆశపడకుండా ఆ బంగారాన్ని వెంటనే పోలీస్ స్టేషన్‌లో అప్పగించి తన నిజాయతీని చాటుకున్నారు. నిజానికి దురై కుటుంబ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అతని కుమారుడు సామ్రాజ్ మూడేళ్ల క్రితం ప్రమాదవశాత్తు వెన్నెముక దెబ్బతిని మంచానికే పరిమితమయ్యాడు. ఇప్పటికే అప్పులు చేసి వైద్యం చేయించినా కుమారుడు కోలుకోలేదు. పిల్లాడికి శస్త్రచికిత్స చేయాలంటే రూ. 4 లక్షలు అవసరమని వైద్యులు చెప్పడంతో, ఆ సాయం కోసం దురై ఇదివరకే ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. చేతిలో లక్షల విలువ చేసే బంగారం ఉన్నా, కన్నకొడుకు ప్రాణం కంటే నిజాయతీ గొప్పదని నమ్మిన ఆయన వ్యక్తిత్వం అందరినీ ఆశ్చర్యపరిచింది. దురై చేసిన ఈ గొప్ప పని గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పూండి కలైవానన్ చలించిపోయారు. తిరువారూర్ కలెక్టరేట్‌లో దురైని ఘనంగా సన్మానించారు. అనంతరం, దురై కుమారుడి వైద్య ఖర్చుల కోసం తన సొంత నిధుల నుంచి రూ. 4 లక్షల చెక్కును బహుమతిగా అందజేశారు.
Share