సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కోరారు. ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా చొరబడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మన దేశ కీర్తిని పాడు చేసేందుకు ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారా చొరబడి దారుణాలకు తెగబడతారని తెలిపారు. ఈ సందర్భంగా 26/11 ముంబై ఉగ్రదాడి ఘటనను ఉదహరించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సీఐఎస్ఎఫ్ జవాన్లు 100 మంది పశ్చిమ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 7 వేల కిలోమీటర్ల సైకిల్ ప్రచార యాత్ర చేపట్టనున్నారని తెలిపారు. వారు మీ ప్రాంతాలకు వచ్చేటప్పుడు స్వాగతించి, కుదిరితే వారితో కొంచెం దూరం వెళ్లి ఉత్సాహం నింపాలని రజనీకాంత్ కోరారు.
Share