తెలుగు చిత్రసీమలో ఏదైనా సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే.. పలువురు దర్శకనిర్మాతలు ఆ నెపాన్ని ప్రేక్షకుల మీదో, లేదంటే రివ్యూయర్ల మీదో తోసేస్తుంటారు. తాము సరిగా తీయకపోవడం వల్లే కలెక్షన్స్ రాలేదనే నిజాన్ని ఒప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. అయితే, ఇప్పుడు అలాంటి వాళ్లందరికీ స్టార్ హీరోయిన్ సమంత తన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' విజయంతో చిన్నపాటి షాక్ ఇచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధంగా కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం, కంటెంట్ బాగుంటే ఆర్భాటాలు లేకపోయినా జనాలు ఖచ్చితంగా ఆదరిస్తారని మరోసారి నిరూపించింది. నిజానికి ఈ సినిమా విడుదలకు ముందు ట్రేడ్ వర్గాల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. సమంత హీరోయిన్గా సినిమా చేసి మూడేళ్లు కావడం, ఆమె గత చిత్రం 'ఖుషి' కూడా ఆశించినంతగా ఆడకపోవడంతో 'మా ఇంటి బంగారం' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందోనని అందరూ భావించారు. దీనికి తోడు జూన్ నెల మధ్యలో పాఠశాలలు తెరిచిన సమయంలో సినిమా రిలీజ్ కావడం వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తారా అనే డౌట్స్ కూడా వచ్చాయి. రివ్యూలు కూడా యావరేజ్‌గానే వచ్చినప్పటికీ, సమంత తన క్రేజ్‌తో అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ మొదటి వీకెండ్ ముగిసేసరికి ఏకంగా రూ.43 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం టాలీవుడ్లో ఓ మాదిరిగా ఆడిన పెద్ద సినిమాలు కూడా రూ.20-30 కోట్లు రాబట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అలాంటి క్లిష్ట సమయంలో ఏ స్టార్ హీరో సపోర్ట్ లేకుండా, కేవలం సమంత వన్‌మెన్ షోగా నడిచిన లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు రావడం మిడ్ రేంజ్ హీరోలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.