Current Date: 06 Oct, 2024

బీజేపీ పాదయాత్రకి నో చెప్పిన కేంద్ర మంత్రి!

కర్ణాటకలో బీజేపీ చేపట్టిన పాదయాత్రకు కేంద్ర మంత్రి, జేడీ(ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు. రాష్ట్రంలో సిద్ధరామయ్య ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు నిరసనగా ఆగస్టు 3 నుంచి ఏడు రోజుల పాటు పాదయాత్ర చేపట్టాలని బీజేపీ ప్రతిపాదించింది.కానీ రాష్ట్ర ప్రస్తుత సవాళ్లను పేర్కొంటూ జేడీ(ఎస్) ఉపసంహరణ నిర్ణయాన్ని కుమారస్వామి వివరించారు. వర్షాలు, కొండచరియలు విరిగిపడి, పంట ధ్వంసంతో రాష్ట్రం మొత్తం అల్లాడిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాదయాత్ర చేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే విరమించుకున్నాం అని కుమారస్వామి  స్పష్టం చేశారు. పాదయాత్ర వల్ల రాష్ట్ర ప్రజలకు ఏం లాభం అంటూ వెటకారంగా ప్రశ్నించారు. వాస్తవానికి కుమారస్వామిని ఈ పాదయాత్ర చర్చలు, నిర్ణయాల విషయంలో బీజేపీ భాగస్వామ్యం చేయలేదు. 
జేడీ(ఎస్) అలెయన్స్‌లో ఉన్నా   కనీసం మాట మాత్రంగా కూడా చెప్పకుండా నిర్ణయాన్ని ప్రకటించారు. దాంతో మమ్మల్ని విశ్వాసంలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు, మేము బీజేపీకి ఎందుకు మద్దతు ఇవ్వాలి? అని కుమారస్వామి ఎదురు ప్రశ్నిస్తున్నారు. దాంతో బీజేపీ పాదయాత్రపై సందిగ్ధత నెలకొంది.

Share