తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో చోటుచేసుకున్న ఒక వింత దొంగతనం కేసు పోలీసులను విస్మయానికి గురిచేసింది. కాపవరానికి చెందిన ముండ్రు పద్మ అనే మహిళ, ఈనెల 26న నలుగురు దొంగలు తనను బంధించి రూ. 27 లక్షల విలువైన బంగారాన్ని దోచుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు జరిపిన లోతైన దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. ఇన్సూరెన్స్ సొమ్ము కోసమే ఆమె ఈ దొంగతనం నాటకాన్ని ఆడినట్లు తేలింది. నిందితురాలు పద్మ తన ఇంట్లోని వస్తువులను చెల్లాచెదురుగా పడేయడం, సీసీ కెమెరాల వైర్లను తొలగించడం వంటి దృశ్యాలు కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు వీటిని ఆధారంగా చేసుకుని ప్రశ్నించగా, ఆమె నిజం ఒప్పుకున్నారు. 15 రోజుల క్రితం కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలకు బీమా ఉందని, ఆ డబ్బును పొందేందుకే ఈ పథకం పన్నానని ఆమె అంగీకరించారు. బీమా సొమ్ము కోసం ఇలాంటి తప్పుడు ఫిర్యాదులు చేయడం నేరమని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటామని క్రైం డీఎస్పీ సుభాష్ వెల్లడించారు.