Current Date: 29 Mar, 2026

ఈరోజు నుంచి ఐపీఎల్ 2026 షురూ.. 74 మ్యాచ్‌లతో క్రికెట్ పండగ

ఐపీఎల్ 2026 సీజన్ ధమాకా నేటి నుంచే ప్రారంభం కానుంది. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. మొత్తం 10 జట్లు, 74 మ్యాచ్‌లతో రాబోయే రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులకు ఈ టోర్నీ అపరిమిత వినోదాన్ని పంచనుంది. గత ఏడాది ఆర్సీబీ విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంతాప సూచకంగా, ఈసారి ఐపీఎల్ ఆరంభోత్సవ వేడుకలను నిర్వహించకూడదని నిర్వాహకులు నిర్ణయించారు. మైదానంలో ఆటగాళ్ల మధ్య హోరాహోరీ పోరు సాగనున్న నేపథ్యంలో, పాత ప్రత్యర్థులు సహచరులుగా, జాతీయ జట్టు సహచరులు ప్రత్యర్థులుగా మారి ట్రోఫీ కోసం పోటీ పడనున్నారు. ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తమ ఆధిపత్యాన్ని చాటాలని చూస్తుండగా.. కోల్‌కతా, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, లఖ్‌నవూ, గుజరాత్ టైటాన్స్ జట్లు కూడా కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. పదేళ్ల నిరీక్షణ తర్వాత రెండో కప్పు గెలవాలని సన్‌రైజర్స్, వరుసగా రెండోసారి టైటిల్‌ను నిలబెట్టుకోవాలని ఆర్సీబీ పట్టుదలతో ఉన్నాయి.