Current Date: 31 Mar, 2026

బిడ్డతో చనిపోతున్నా.. భర్త వాట్సాప్‌ మెసేజ్‌కి భార్య ఎమోషనల్ రిప్లై

పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఒక విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకుని భోపాల్ ఎయిమ్స్‌లో వైద్యుడిగా పనిచేస్తున్న కుంభా గోపి, నర్సుగా పనిచేస్తున్న శంకరకుమారి దంపతులు తమ మూడేళ్ల కుమార్తె మౌనిహ శారీరక, మానసిక ఎదుగుదల సరిగ్గా లేదన్న ఆవేదనతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి, బిడ్డ మృతి చెందగా, తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం, బిడ్డ అనారోగ్యం కారణంగా మనస్తాపానికి గురైన ఈ దంపతులు చనిపోవాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. "పాప, నేను కలిసి చనిపోతాం" అని భర్త పంపిన వాట్సప్ సందేశానికి, "చావైనా బతుకైనా నీతోనే, ముగ్గురం కలిసే చనిపోదాం" అని భార్య సమాధానమిచ్చింది. శనివారం రాత్రి నరసరావుపేటలోని ఒక లాడ్జిలో దిగిన వీరు, మత్తు ఇంజెక్షన్లు తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. గోపి తన సోదరికి పంపిన వాట్సప్ చిత్రాలు, లొకేషన్ ఆధారంగా కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే శంకరకుమారి, చిన్నారి మౌనిహ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం గోపి ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.