అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై జరపాలనుకున్న భీకర దాడుల విషయంలో అనూహ్యంగా వెనక్కి తగ్గారు. హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరించిన ఆయన, తాజాగా 5 రోజుల విరామం ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ నేతలతో ఫలవంతమైన చర్చలు జరుగుతున్నాయని, ఈ వారమంతా అవి కొనసాగుతాయని తన 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ వెల్లడించారు. అయితే, ట్రంప్ ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికాతో అసలు చర్చలే జరగడం లేదని, కేవలం హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామన్న తమ హెచ్చరికలకే ట్రంప్ దిగివచ్చారని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తుర్కియే, రష్యా విదేశాంగ మంత్రులతో సంప్రదింపులు జరుపుతుండటం గమనార్హం. ఈ యుద్ధ మేఘాల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై తీవ్రంగా పడింది. సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి, బిఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1800 పాయింట్లకు పైగా నష్టపోయింది. అటు అమెరికా చర్చలు జరుగుతున్నాయని చెబుతుంటే, ఇటు ఇరాన్ మాత్రం చర్చల ప్రసక్తే లేదని చెప్పడంతో అంతర్జాతీయ స్థాయిలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
Share