ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు భారత చెస్ దిగ్గజం కోనేరు హంపి తీసుకున్న నిర్ణయం క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల దృష్ట్యా, యుద్ధనౌకల పహారా మధ్య సైప్రస్‌లో ప్రశాంతంగా ఆడటం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. రెండుసార్లు ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌గా నిలిచిన హంపి, సైప్రస్ వంటి ప్రాంతాల్లో క్రీడాకారులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండదని అభిప్రాయపడ్డారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు సైప్రస్‌కు వెళ్లొద్దని 'లెవల్-3' హెచ్చరికలు జారీ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కేవలం విలాసవంతమైన రిసార్టులు ఉంటే సరిపోదని, మానసిక ప్రశాంతత లేని చోట ఆడలేనని చెబుతూ.. తన కుమార్తెకు మూడు నెలలు దూరంగా ఉండి ఈ టోర్నీ కోసం కష్టపడ్డానని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పుకోవడమే సరైనదని పేర్కొన్నారు. హంపి వైదొలగడంతో ఆమె స్థానంలో ఉక్రెయిన్ క్రీడాకారిణి, మాజీ ప్రపంచ ఛాంపియన్ అనా ముజిచుక్‌ను అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఎంపిక చేసింది.
Share