Current Date: 29 Mar, 2026

భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్? టెన్షన్ పెంచుతున్న మోదీ ఎమర్జెన్సీ మీటింగ్

దేశంలో లాక్‌డౌన్ వార్తలపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావడంతో ప్రజల్లో తలెత్తిన అనుమానాలను పటాపంచలు చేస్తూ, దేశంలో లాక్‌డౌన్ విధించే ఆలోచన ఏదీ లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తేల్చి చెప్పారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా ఇంధన సరఫరా, అత్యవసర వస్తువుల రవాణా వంటి అంశాలను ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని, బాధ్యతాయుతంగా ఉండాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహించిన ఈ సమావేశం కేవలం ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు,  దేశీయ సరఫరా వ్యవస్థలపై సమీక్ష కోసమేనని అర్థమవుతోంది. లాక్‌డౌన్ వంటి కఠిన నిర్ణయాలు ఏవీ ప్రభుత్వం వద్ద పరిశీలనలో లేవని స్పష్టమవ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని మాత్రం తెలుస్తోంది.