Current Date: 04 Jul, 2024

తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా చుడిదార్ గ్యాంగ్.. జాగ్రత్త!

తెలుగు రాష్ట్రాలను ఇన్నాళ్లు చడ్డీ గ్యాంగ్ భయబ్రాంతులకి గురిచేసింది. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్‌ నగరంలో చుడిదార్ గ్యాంగ్ ఎంటరైంది. ఇప్పటివరకు బ్లేడ్ బ్యాచ్, చెడ్డీగ్యాంగ్‌ అంటూ రకరకాల గ్యాంగుల పేర్లతో దొంగలు దోచుకున్న విషయం తెలిసిందే.

గతంలో అపార్ట్‌మెంట్లలో చెడ్డీ గ్యాంగ్. ఒంటి మీద కేవలం చెడ్డీ మాత్రమే ధరించి.. ఒళ్లంతా నూనె పూసుకుని, ముఖం కనిపించకుండా టవల్‌తో చుట్టుకుని.. రాత్రిపూట రాడ్లు, కత్తులతో దొంగతనాలు చేసేవాళ్లు. ఎవరైనా అడ్డుపడితే.. వాళ్లను కిరాతకంగా చంపేయటం వల్ల చెడ్డీ గ్యాంగ్ అంటే జనాల్లో ఓ భయం ఏర్పడింది. వాళ్లు దొంగతనాలు చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయినా.. ఏమాత్రం భయంలేకుండా చోరీ చేసేవాళ్లు. అచ్చం అదే తరహాలోనే ఇప్పుడు హైదరాబాద్‌లోకి కొత్తగా చుడీదార్ గ్యాంగ్ ఎంటరైంది.

ఎస్ఆర్‌నగర్‌లో మహిళల వేషధారణలో వచ్చిన దొంగలు చోరీకి పాల్పడడం కలకలం రేపుతోంది. దొంగలు.. చుడిదార్లు వేసుకుని లేడీ గెటప్‌లో వచ్చి దొంగతనం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. వాళ్లు చోరీ చేసిన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని సీసీకెమెరాల్లో రికార్డు కాగా.. వాళ్లు ఏమాత్రం భయపడకుండా దర్జాగా వెళ్తుండటం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది.

ఈ చుడిదార్ గ్యాంగ్ నాలుగు తులాల బంగారం, లక్ష రూపాయల నగదు, ఓ ల్యాప్‌టాప్ దొంగిలించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.