గత కొద్దిరోజులుగా స్టార్ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తమిళ వెటరన్ నటుడు, 'టీవీకే' పార్టీ అధినేత విజయ్‌తో ఆమెకు ఉన్న అనుబంధంపై కోలీవుడ్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు బీజేపీ నేత నాగేంద్రన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసి, ఆపై విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పడం వివాదాన్ని మరింత రాజేసింది. విజయ్ సతీమణి సంగీత చేసిన కొన్ని ఆరోపణల నేపథ్యంలో కొందరు కావాలనే త్రిష పేరును ఈ వివాదాల్లోకి లాగడం గమనార్హం. ఎలాంటి ప్రమేయం లేకుండానే తన పేరును వివాదాల్లోకి లాగడంపై త్రిష అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. తనపై వస్తున్న రూమర్లకు పరోక్షంగా సమాధానం ఇస్తూ ఆమె సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశారు. "ప్రతిదీ ప్రేమ కాదు.. కానీ, ప్రేమ లేకపోతే దేనికీ అర్థం లేదు" అంటూ ఒక కొటేషన్ రాసుకొచ్చారు. దానికి 'ఫ్యాక్ట్' అనే క్యాప్షన్‌ను కూడా జోడించడంతో ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం త్రిష చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టడానికే ఆమె ఈ విధంగా స్పందించారని కొందరు అభిప్రాయపడుతుంటే, అసలు ఈ సమయంలో ఇలాంటి పోస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని మరికొందరు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా, తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారానికి త్రిష తన స్టైల్లో గట్టిగానే బదులిచ్చారని అభిమానులు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలుపుతున్నారు.
Share