బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 హై-వోల్టేజ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఆ తర్వాత ఛేదనలో చెన్నై జట్టు పట్టుదలగా పోరాడినప్పటికీ, 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయగా, చెన్నైకి ఇది వరుసగా మూడవ ఓటమి. ఈ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 25 బంతుల్లో 8 సిక్సర్లు, 3 ఫోర్లతో అజేయంగా 70 పరుగులు చేసి చెన్నై బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ముఖ్యంగా జేమీ ఓవర్టన్ వేసిన 19వ ఓవర్‌లో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. డేవిడ్‌తో పాటు రజత్ పాటిదార్ 48 నాటౌట్, దేవదత్ పడిక్కల్ 50 పరుగులతో రాణించడంతో ఆర్సీబీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. 18వ ఓవర్‌లో అన్షుల్ కాంబోజ్ వేసిన బంతికి టిమ్ డేవిడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పెవిలియన్ వైపు వెళ్తుండగా, అంపైర్ అది 'నో బాల్' అని ప్రకటించడంతో డేవిడ్ మళ్లీ క్రీజులోకి వెనక్కి వచ్చాడు. ఆ లైఫ్ ఇచ్చి ఉత్సాహంతో మరింత రెచ్చిపోయిన డేవిడ్, స్టేడియం బయటకు వెళ్లేలా భారీ సిక్సర్లతో చెలరేగిపోయాడు.
Share