Current Date: 11 May, 2026

రంగస్వామి సలహాతో సీఎంగా విజయ్.. సెంటిమెంట్ రిపీట్

పుదుచ్చేరి, తమిళనాడు రాజకీయాల్లో 'రెండు నియోజకవర్గాల' సెంటిమెంట్ బలంగా పనిచేసింది. పుదుచ్చేరిలో ఎన్.ఆర్. కాంగ్రెస్ అధినేత రంగసామి, తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్ ఈ సెంటిమెంట్‌ను అనుసరించి అఖండ విజయం సాధించారు. పార్టీ స్థాపించిన తొలి ఎన్నికల్లోనే విజయ్ అధికారంలోకి రాగా, రంగసామి ఐదోసారి ముఖ్యమంత్రిగా ఈ నెల 13న బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం, పరస్పర సలహాలు ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రంగసామికి రెండు స్థానాల్లో పోటీ చేస్తే ముఖ్యమంత్రి అవుతారనే గట్టి నమ్మకం ఉంది. 2011లో రెండు చోట్ల గెలిచి సీఎం అయిన ఆయన, 2016లో ఒకే చోట పోటీ చేసి ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. తిరిగి 2021లో రెండు చోట్ల పోటీ చేసి గెలవడంతో మళ్ళీ అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. అదే బాటలో ఈసారి కూడా తట్టంచావడి, మంగళం నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచి విజయాన్ని అందుకున్నారు. రంగసామికి ఉన్న ఈ సెంటిమెంట్‌ను నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కూడా తూచా తప్పకుండా పాటించడం విశేషం. విజయ్ తమిళనాడులోని పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండింటిలోనూ ఘనవిజయం సాధించారు. రంగసామి తరచూ విజయ్‌ను కలిసి రాజకీయ సలహాలు ఇస్తుండగా, టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ వీరిద్దరి మధ్య వారధిగా వ్యవహరిస్తున్నారు. విజయ్ నిర్వహించిన పార్టీ తొలి మహానాడుకు రంగసామి ప్రసాదాన్ని పంపడం వారి స్నేహానికి నిదర్శనం. మొత్తానికి ఇద్దరు మిత్రులు ఒకే రకమైన వ్యూహంతో అటు పుదుచ్చేరి, ఇటు తమిళనాడులో ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.