Current Date: 04 Jul, 2024

లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు

  దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.   ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆప్ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుతో అరవింద్ కేజ్రీవాల్‌కు‌ బెయిల్ లభించింది. మార్చ్ 21వ తేదీన ఈ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచే పరిపాలన చేస్తూ వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీ అధినేతగా ప్రచారం కోసం మద్యంతర బెయిల్‌పై బయటికొచ్చారు. షరతులతో కూడిన బెయిల్ గడువు పూర్తయ్యాక జూన్ 2వ తేదీన తరిగి తీహార్ జైలు అధికారులకు సరెండర్ అయ్యారు. ఆ తరువాత తిరిగి రెగ్యులర్ బెయిల్ పిటీషన్‌పై విచారణ కొనసాగింది.   ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ 100 కోట్లు డిమాండ్ చేసినట్టు ఆధారాలున్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ వాదించింది. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్టు తెలిపింది. అయితే పీఎంఎల్ఏ కింద దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో అరవింద్ కేజ్రీవాల్ పేరు లేదని ఆయన తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటులో కూడా కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదని గుర్తు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్‌పై రౌస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ న్యాయ్ బింగూ ఇవాళ ఉదయం తీర్పు రిజర్వ్ చేసి సాయంత్రానికే బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.   తీర్పును హైకోర్టులో సవాలు చేసేందుకు వీలుగా 48 గంటలపాటు స్టే విధించాలన్న ఈడీ అభ్యర్ధనను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. రేపు శుక్రవారం అరవింద్ కేజ్రీవాల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Share