కర్ణాటక సీనియర్ నటుడు ఉపేంద్ర రాజకీయ ప్రస్థానం గురించి కన్నడ నటుడు శివరాజ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ఉపేంద్ర రాజకీయాల్లో చురుగ్గా ఉంటే అది మంచి పరిణామమేనని అభిప్రాయపడ్డారు. ఇటీవల తమిళనాడులో నటుడు విజయ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజలు ఆయనకు ఎంతగా మద్దతు ఇచ్చారో చూశామని గుర్తుచేశారు. అదే తరహాలో కర్ణాటకలో ఉపేంద్రకు కూడా ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వకూడదని ప్రశ్నించారు. సినిమా నటీనటులు కేవలం వెండితెరపై పాత్రల కోసమే ముఖాలకు రంగులు వేసుకుంటారని, నిజ జీవితంలో రంగులు మార్చరని ప్రముఖ శివరాజ్ కుమార్ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ‘పెద్ది’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తమ కుటుంబం ప్రజలకు ఎంతో సేవ చేస్తోందని, అయితే తాము చేసే సేవా కార్యక్రమాలు ప్రపంచానికి చాటిచెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాము సినిమాల కోసమే మేకప్ వేసుకున్నప్పటికీ, ప్రజలకు సేవ చేసే విషయంలో మాత్రం ఎలాంటి రంగులు లేకుండా స్వచ్ఛంగా ఉంటామని పేర్కొన్నారు. నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి ఘన విజయం సాధించడంపై తాను ఎంతో సంతోషించానని శివరాజ్ కుమార్ తెలిపారు. విజయ్ ప్రసంగాలు ఎంతో ఆకట్టుకున్నాయని, ఆయన వల్ల సమాజంలో మార్పు వస్తుందని భావించానని చెప్పారు. నిజాయితీగా పనిచేసే వారిని భగవంతుడు కచ్చితంగా గుర్తిస్తాడని అన్నారు.