Current Date: 29 May, 2026

పెద్దపులి బీభత్సం.. గిరిజనుల్లో భయం

 మనుషులపై దాడి చేయకముందే పెద్దపులిని పట్టుకోండి

అటవీశాఖను వేడుకున్న గ్రామస్తులురాజవొమ్మంగి, న్యూస్ లీడర్, మే 29 : రాజవొమ్మంగి మండలంలో సంచరిస్తున్న పెద్దపులి గ్రామాల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. ఇప్పటికే తొమ్మిది దూడలను బలిగొన్న పెద్దపులి కారణంగా గిరిజనులు రాత్రిళ్లు బయటకు రావడానికి కూడా జంకుతున్నారు. పెద్దపులి దాడుల్లో పశువులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు జిల్లా అటవీశాఖాధికారి శివకుమార్ గంగాల్ గురువారం తాత్కాలిక నష్టపరిహారం అందజేశారు. చికిలింత గ్రామానికి చెందిన కాకర జోగిరాజుకు ఏడు దూడల నష్టానికి రూ.35 వేలు, పెదగర్రంగికి చెందిన బచ్చలి లోవరాజుకు రూ.5 వేలు, పెదరేల్లంగిపాడు గ్రామానికి చెందిన కాకూరి సత్యవతికి రూ.5 వేల చొప్పున పరిహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పశువులపై దాడులు చేస్తున్న పెద్దపులి ఎప్పుడు మనుషులపై దాడి చేస్తుందోనని భయపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి పెద్దపులిని బంధించాలని కోరారు. డీఎఫ్‌ఓ శివకుమార్ గంగాల్ మాట్లాడుతూ ప్రస్తుతం తాత్కాలిక నష్టపరిహారం అందించామని, పశువైద్యుల ధ్రువీకరణ అనంతరం పూర్తి పరిహారం మంజూరు చేస్తామని తెలిపారు. పెద్దపులిని పట్టుకునేందుకు ఉన్నతాధికారులకు ప్రత్యేక నివేదిక పంపించినట్లు చెప్పారు. పోలవరం జిల్లాలో ఇప్పటివరకు పెద్దపులి దాడుల్లో 20 పశువులు మృతి చెందగా రూ.2.50 లక్షల పరిహారం అందించినట్లు వెల్లడించారు.